హైదరాబాద్‌ః హైదరాబాద్‌లో రౌడీలు, గూండాలు, భూఅక్రమణదారులను నిర్ధాక్షిణ్యంగా అణిచివేయనున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే జంటనగరాల రూపురేఖలు మారిపోతాయని ఆయన చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఆఖరు రోజు ఆదివారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమీర్‌పేట, సనత్‌నగర్, ఎర్రగడ్డ, ఖైరతాబాద్ ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన జరిపారు.
హైదరాబాద్‌లో రౌడీరాజ్యం సాగుతున్నదని దానిని ఉక్కపాదంతో అణిచివేస్తామని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటనతో ఈ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ ఎన్నికల్లోవిజయావకాశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తివిశ్వాసంతో వున్నారు. కాంగ్రెస్, మజ్లిస్ గెలిస్తే నగరం మురికికూపంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి హైదరాబాద్‌ను ప్రతిష్టాత్మకమైన నగరంగా తీర్చిదిద్దుతున్న కారణంగా హైదరాబాద్‌లో తాము గెలిచితీరుతామని ఆయన అన్నారు. ధరలపైవిపక్షాల ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు.