కోల్‌కతః ఈడెన్ గార్డెన్స్‌లో శనివారం నాడు జరిగిన తొలివన్‌డేలో ఇంగ్లాండ్ జట్టుపై భారత్ సంచలన విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. కాగా ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 44 ఓవర్లలోనే 259 పరుగులకు ఆలౌట్ అయింది.
అజిత్ అగార్కర్ మూడువికెట్లు తీసి భారత్ విజయానికి మార్గం సుగమం చేశాడు. ఆరంభంలోనే మూడువికెట్లు పడిపోయినప్పటికీ మార్కస్ ట్రెస్కోథిక్ మెరుపు వేగంతో 109 బంతుల్లో 121 పరుగులు చేసి జట్టును సురక్షిత స్థానంలో నిలిపారు. ఇంగ్లాండ్ ఒక దశలో 35 ఓవర్ల వద్ద 224 పరుగులతో భారత్ లక్ష్యాన్ని అవలీలగా ఛేదించే అవకాశం వున్నట్టుగా కనిపించింది. ఇంగ్లాండ్‌పై వత్తిడి పెంచడంలో గంగూలీ సఫలం అయ్యారు. హర్బజన్ బౌలింగ్‌లో ప్లింటాఫ్ ఔట్ కావడంతో ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత మరో ముప్ఫయి పరుగుల స్కోర్‌లోనే అన్నివికెట్లు కుప్పకూలిపోయాయి.