హైదరాబాద్‌ః అనుకూలమైన వాతావరణం ఏర్పడితే ప్రభుత్వంతో బేషరతుగా చర్చలకు సిద్ధంగా వున్నామని పీపుల్స్‌వార్ ప్రకటించింది. పార్టీ అధినాయకత్వం నుంచి ఈ సంసిద్ధత రావడం గమనార్హం. ఎన్‌కౌంటర్లను నిలిపివేయాలని, కూంబింగ్ ఆపరేషన్లు రెండు మూడు నెలలపాటు ఆపివేయాలని, ప్రజలను, ప్రజాసంఘాల కార్యకర్తలను బందించి హింసించే పద్దతులను కట్టిపెట్టాలని వార్ ప్రతిపాదించింది.
రాష్ట్రంలో హింసాత్మక వాతావరణాన్ని నివారించేందుకు పౌరస్పందన వేదిక చేస్తున్న ప్రయత్నాలకు స్పందించిన నక్సలైట్లు ఈ మేరకు ఒక లేఖనురాశారు. ఈ లేఖపై పీపుల్స్ వార్ కేంద్ర నాయకత్వం తరఫున ప్రకాష్, రాష్ట్ర కమిటీ తరఫున రామకృష్ణ సంతకాలు చేశారు. చర్చలకు ప్రభుత్వం కూడా సిద్ధమేనని అయతే ఎవరితో మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి ఎవరు బాధ్యులు అని ముఖ్యమంత్రి, హోం మంత్రి డిజిపి చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో పార్టీ నాయకత్వంతో నేరుగా చర్చలు జరపాలన్నదే తమ సూచనని వారు వెల్లడించారు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా వుండేపీపుల్స్ వార్ అగ్రనాయకత్వం ఉత్తర తెలంగాణా, ఆంధ్రాఒరిస్సా సరిహద్దు ఏరియాల్లో ఎక్కడికైనా ప్రతినిధి వర్గాన్ని రమ్మనవచ్చని లేఖపేర్కొంది. అత్యంత అమానుషమైన వరంగల్ ఎన్‌కౌంటర్ తర్వాత కూడా నిజామాబాద్ జిల్లాలో ఐలన్నను, ఆదిలాబాద్ జిల్లాలో కట్టెలు కొట్టడానికి వెళ్లిన మధుకర్‌ను పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపారని వారు అన్నారు.