పోలింగ్ 60 శాతం, దాదాపు ప్రశాంతం
హైదరాబాద్: చెదురు మొదురు సంఘటనలుమినహా మినీ మున్సిపల్ ఎన్నికల్లో మంగళవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ రమారమి 60 శాతం జరిగి వుంటుందనిఅంచనా. హైదరాబాద్, రాజమండ్రి నగర పాలక సంస్థల ఎన్నికల్లో పోలింగ్ 60 శాతానికి మించకపోవడం గమనార్హం. హైదరాబాద్‌లో 53 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది.
ధూల్‌పేట, కాచిగూడా ప్రాంతాల్లో పోలీసులు జోక్యం చేసుకుని ఘర్షణలను నివారించారు.ఆసిఫ్‌నగర్, కార్వాన్‌లలో దొంగవోట్లు వేయడానికి ప్రయత్నించినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బర్కత్‌పురాలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తను అక్రమంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిలకలగుడా పోలీసుస్టేషన్ వద్ద గొడవ చేశారు.
జూబిలీహిల్స్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీసమేతంగా ఓటు వేశారు. గవర్నర్ రంగరాజన్ దంపతులు రాజభవన్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలుగుదేశం మేయర్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి, మజ్లీస్ అభ్యర్థి జుల్ఫీకర్ అలీ, కాంగ్రెస్ అభ్యర్థి నాగేందర్, టిఆర్‌ఎస్ అభ్యర్థి నాయని నర్సింహారెడ్డి తమ తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు.
హిందూపూర్‌లో పోలింగ్ భారీగానే జరిగింది. దొంగ వోట్లు వేసుకున్నారని తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. తెలుగుదేశం జిల్లా కార్యదర్శి ఆస్మాయిల్, సిపిఐ కౌన్సిలర్‌లు సహా వివిధ పార్టీల వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గడ్డిఅన్నారం మున్సిపాలిటీలో 52 శాతం ఓట్లు పడ్డాయి. రిగ్గింగ్‌కు పాల్పడ్డారంటూ పరస్పరంఅరోపణలు చేసుకుంటూ కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని చెదరగొట్టారు. మర్కాపురంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఇక్కడ 68 శాతం పోలింగ్ జరిగినట్లు సమాచారం.