జూన్ 2న పెనుకొండ ఉప ఎన్నిక
న్యూఢిల్లీ: అనంతపురం జిల్లా పెనుకొండ శానసభా నియోజకవర్గం ఉప ఎన్నిక జూన్ 2వ తేదీన జరుగుతుంది. మే 9 నుంచి 16వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు మే 19వ తేదీ. ఓట్ల లెక్కింపు జూన్ 5వ తేదీన జరుగుతుంది.
తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్యతో పెనుకొండ నియోజకవర్గానికి ఉప ఎన్నికల జరపాల్సి వస్తోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్తిగా పరిటాల రవి భార్య సునీత పోటీ చేసే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ సీటును పరిటాల రవి హత్య కేసులో నిందితుడు, జూబిలీహిల్స్ బాంబు పేలుళ్ల కేసులో నేరస్థుడు మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి భార్య భానుమతి ఆశిస్తున్నట్లు సమాచారం. ఆమె సాధారణ ఎన్నికల్లో రవిపై పోటీ చేసి ఓడిపోయారు. అయితే మారిన పరిస్థితుల్లో భానుమతికి టికెట్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి సుముఖంగా లేరని చెప్తున్నారు. ఇటీవల అనంతపురం జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో భానుమతిని వేదిక మీదికి ఆహ్వానించకపోవడాన్ని బట్టి, కనీసం ఆమెను పలకరించడానికి కూడా ఇష్టపడకపోవడాన్ని బట్టి భానుమతికి టికెట్ రాకపోవచ్చుననే ప్రచారానికి బలం చేకూరుతోంది.












Click it and Unblock the Notifications