లెఫ్ట్ మద్దతు లేకుండా ఎలా సాధ్యం?: వెంకటస్వామి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా, తెచ్చినా కాంగ్రెస్‌కే సాధ్యమని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జి. వెంకటస్వామి అన్నారు. వామపక్షాల మద్దతు లేకుండా తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధిస్తుందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) రెండో రాష్ట్రాల పునర్విభజన కమీషన్ (రెండో ఎస్సార్సీ)కి అంగీకరించి వుంటే తెలంగాణ ఎప్పుడో వచ్చి ఉండేదని ఆయన అన్నారు.
తెలంగాణపై ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో ఏర్పాటయిన కమిటీని తాను బోగస్ అనలేదని, బోగస్ ప్రకటనలు ఇవ్వవద్దని మాత్రమే అన్నానని, తెలంగాణ రేపోమాపో వస్తుందంటూ ప్రకటనలు ఇవ్వకూడదని తన ఉద్దేశమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) నాయకుడు ఎ. నరేంద్ర కన్నా తనకు తెలంగాణ రావాలని ఎక్కువగా ఉన్నదని ఆయన అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఎప్పుడో తెలంగాణ వచ్చి వుండేదని, ఐక్య ప్రగతిశీల కూటమి (యుపి ఎ) సంకీర్ణ ప్రభుత్వం కావడం వల్ల తెలంగాణ రావడం కష్టంగా ఉన్నదని ఆయన అన్నారు. వామపక్షాల సభ్యులు 60 మంది ఉన్నారని, అటువంటప్పుడు వామపక్షాలు ఒప్పుకోకుండా తెలంగాణ ఎలా వస్తుందనేది తన వాదన అని ఆయన అన్నారు.
బొగ్గు గని కార్మికుల వేతన ఒప్పందం అమలుపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications