తెలంగాణపై విజయశాంతి గట్టి పట్టు: ఇంద్రసేన్
వరంగల్: తెలంగాణ విషయంలో తమ పార్టీ నాయకురాలు, సినీనటి విజయశాంతి మొదటి నుంచీ గట్టిగానే ఉన్నారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనా రెడ్డి చెప్పారు. విజయశాంతి ఏ ప్రాంతం వారనే చర్చ ముఖ్యం కాదని, ప్రాంతం పేరు చెప్పి ఆమె పోరాటం చేయకూడదనడం సరి కాదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
తెలంగాణ విషయంలో తమ పార్టీ పంథానే విజయశాంతి చెప్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణపై చాలా మంది విజయశాంతి మాదిరిగా పోరాటాన్ని చేయడానికి ముందుకు రావాలనుకుంటున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ పోరాట కార్యక్రమంపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుకుని తగిన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఉచిత విద్యుత్ సరఫరా హామీని తుంగలో తొక్కిన ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి రైతులకు, రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైయస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని ఆయన విమర్శించారు. తెలుగుదేశంతో పొత్తు విషయంలో జిల్లా నాయకత్వాలే నిర్ణయం తీసుకుంటాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
