డాషింగ్ హీరోలా ఉన్నావ్.. బాలీవుడ్ లో ట్రై చేయొచ్చుగా: రష్యా మంత్రిపై కేంద్రమంత్రి
దేశ రాజధాని వేదికగా ప్రతిష్టాత్మక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభానికి ఒక్క రోజే మిగిలివుంది. శనివారం ఈ సమ్మిట్ ఆరంభం కానుంది. ఇందులో పాల్గొనడానికి బ్రిక్స్ సభ్య దేశాధినేతలు, ప్రధానమంత్రులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. చైనా, రష్యా, ఇరాన్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఈజిప్ట్ అధ్యక్షులు, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రౌన్ ప్రిన్స్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. భారత్ మండప్ లో రేపు ఈ సమావేశం ప్రారంభం కానుంది.
ఇందులో భాగంగా.. ఇన్నోప్రామ్ ఇండియా సదస్సు కొద్దిసేపటి కిందటే ఢిల్లీలో ఆరంభమైంది. భారత్, రష్యాల మధ్య ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ద్వైపాక్షిక భేటీ ఇది. ఇందులో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, రష్యా మంత్రి అంటోన్ అలీఖానోవ్ సహా ఈ రెండు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అలీఖనోవ్ ను ఉద్దేశించి పీయూష్ గోయల్ సరదాగా చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సదస్సులో పీయూష్ గోయల్ ప్రసంగించారు. అలీఖానోవ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రష్యా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన అలీఖానోవ్ బహుశా రాంగ్ రూట్ ను ఎంచుకున్నట్లనిపిస్తోందని, బాలీవుడ్ లో హీరోగా ట్రై చేసి ఉండొచ్చని చమత్కరించారు. ఆయనకు ఉన్న హైట్, గ్లామర్, హ్యాండ్‌సమ్ లుక్స్‌తో త్వరలోనే బాలీవుడ్ నుంచి మంచి మంచి ఆఫర్లు దక్కించుకుంటారని పీయూష్ గోయెల్ జోస్యం చెప్పారు.
బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రష్యాతో మంచి అనుబంధం ఉందని పీయూష్ గోయెల్ పేర్కొన్నారు. పలు సినిమాలను రష్యాలో చిత్రీకరించిన విషయాన్ని ఆయన పరోక్షంగా గుర్తు చేశారు. భారత్- రష్యా మధ్య సాంస్కృతిక, ఆడియో విజువల్ రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో ఆయనను వెండితెరపై చూస్తామని, రెండు దేశాల్లోనూ ఆయనకు మంచి ఫాలోయింగ్ ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు.
అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు పీయూష్ గోయెల్. వచ్చే నాలుగేళ్లల్లో ద్వైపాక్షిక వాణిద్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చడమే తమ లక్ష్యమని, పరస్పర పెట్టుబడులను 50 బిలియన్ డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం దాదాపు 60 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యాన్ని రాబోయే నాలుగేళ్లలో మరో 40 బిలియన్ డాలర్ల మేర పెంచడం అంత సులభమైన పని కాదని విశ్లేషించారు. ఈ మైలురాయిని చేరుకోవడానికి ఇరుపక్షాల నుండి బలమైన ప్రయత్నం అవసరమని పేర్కొన్నారు.
😂 🇮🇳 Trade Minister Goyal Says 🇷🇺 Counterpart Alikhanov Is 'Dashing'
— RT_India (@RT_India_news) September 10, 2026
"Maybe we'll see him starring in Bollywood very soon." pic.twitter.com/TLGVVczJwX













Click it and Unblock the Notifications
