పెనుకొండలో శాంతి గెలుస్తుంది: దివాకర్ రెడ్డి
విజయవాడ: అనంతపురం జిల్లా పెనుకొండ శాసనసభా నియోజకవర్గం ఉప ఎన్నికల్లో సానుభూతిపై శాంతి గెలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పరిటాల సునీతపై సానుభూతి ఉన్నప్పటికీ తమ శాంతి సందేశమే గెలుస్తుందని ఆయన అన్నారు. విజయవాడలో ఫ్లయ్ ఓవర్‌ను ఆయన గురువారంనాడు ప్రారంభించారు.
తెలుగుదేశం పార్టీ ఫ్యాక్షన్స్ పెంచి పోషించే ప్రయత్నం చేస్తోందని, రాయలసీమలో ఫ్యాక్షన్స్‌ను అంతం చేస్తామన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి మాటలు నీటి మీది రాతలేనని తేలిపోయిందని ఆయన అన్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్స్‌ను అంతం చేయడానికి పరిటాల రవి, మద్దెలచెర్వు సూరి కుటుంబాలవారికి టికెట్లు ఇవ్వకూడదని తాము ప్రతిపాదించామని, అందుకు తెలుగుదేశం సానుకూలంగా ప్రతిస్పందించలేదని ఆయన అన్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్స్‌ను అంతం చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఏ పార్టీకైనా స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
