అయినా బాబుకు జ్ఞానోదయం జరగలేదు: కెసిఆర్
న్యూఢిల్లీ/హైదరాబాద్: సమైక్యాంధ్రకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ మహానాడు తీర్మానం చేయడంపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్) అధినేత, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్ రావు నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి జ్ఞానోదయం జరగలేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. తెలంగాణ వ్యతిరేక పోకడలను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు వ్యతిరేకించినంత మాత్రాన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని ఆయనే అన్నారు. చంద్రబాబుకు కనీస అవగాహన లేదని ఆయన అన్నారు.
ఐక్య ప్రగతిశీల కూటమిలోని 24 పార్టీల్లో 20 పార్టీలు, పార్లమెంటులోని 38 పార్టీల్లో 34 పార్టీలు తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తున్నాయని ఆయన చెప్పారు. అయినా తెలుగుదేశం పార్టీ ఒంటెత్తు పోకడలను అనుసరిస్తోందని, దీన్ని ప్రజలు తిప్పి కొడతారని ఆయన అన్నారు. తాను పదవిలో ఉండటం వల్లనే తెలంగాణకు వివిధ పార్టీల మద్దతు కూడగట్టగలిగానని, తన పదవిని తెలంగాణ విషయంలో ఏకాభిప్రాయసాధనకు వాడుకున్నానని ఆయన చెప్పారు. తెలంగాణ సాధనకు వీధిపోరాటాలు అసవరం లేదని, వ్యూహాత్మకంగా తాము ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తమకు భరోసా ఉందని ఆయన చెప్పారు.
మహానాడు పేరుతో వ్యక్తిగత దూషణలకు దిగడం తెలుగుదేశం ఫ్యూడల్ ధోరణులకు అద్దం పడుతోందని, తెలంగాణపై చంద్రబాబునాయుడు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాంతీయాభివృద్ధి బోర్డుల ఏర్పాటు ప్రతిపాదన మాత్రమేనని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి కూడా అన్నారని, దానిపై చర్చ కూడా జరగలేదని ఆయన అన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే సమైక్యాంధ్ర వేదిక ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ పిలుపునిస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్) నాయకులు కె. యాదగిరి రెడ్డి, తదితర నాయకులు హైదరాబాద్‌లో విమర్శించారు. తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీకి సమాధి కట్టారని వారన్నారు. తమ నేత కెసి ఆర్‌ను విమర్శించే హక్కు శోభారాణి, మోత్కుపల్లి నర్సింహులు వంటి తెలుగుదేశం నాయకులకు లేదని వారన్నారు.












Click it and Unblock the Notifications
