ఆర్టీసి ఆరోగ్యానికి వైయస్‌కు లెఫ్ట్ సూచనలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( ఎపియస్ ఆర్టీసి)ని నిలబెట్టడానికి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి వామపక్షాల నాయకులు కొన్ని సూచనలు చేశారు. సిపి ఐ, సిపియం నాయకులు సోమవారం ముఖ్యమంత్రిని కలిసి ప్రాజెక్టు నిర్వాసితుల గురించి, ఆర్టీసి గురించి మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వాసితులుగా నష్టపరిహారంగా భూమి ఇవ్వాలని వారు ముఖ్యమంత్రిని కోరారు.
ప్రభుత్వానికి ఆర్టీసి చెల్లించాల్సిన 400 కోట్ల రూపాయలను మాఫీ చేయాలని, ఇతర సంస్థలకు ఆర్టీసి చెల్లించాల్సిన 850 కోట్ల రూపాయలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని వారు సూచించారు. ఆర్టీసికి లాభాలు వచ్చిన తర్వాత చెల్లించేలా ఒప్పందాలు చేయించాలని కూడా వారు సూచించారు. ఆర్టీసి ఉద్యోగులకు, విద్యార్థులకు కల్పిస్తున్న రాయితీలకు సంబంధించిన సొమ్మును ప్రభుత్వం నేరుగా ఆర్టీసికి చెల్లించాలని వారు సూచించారు. ఆర్టీసి విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిరసనగా ఆర్టీసి కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
