దిగిరాని జూ. డాక్టర్లు: సమ్మె కొనసాగింపు
హైదరాబాద్: సమ్మెను కొనసాగించాలని జూనియర్ డాక్టర్ల సంఘం నిర్ణయించింది. ఈ విషయాన్ని గుంటూరు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. తమ సమ్మె వెనక అదృశ్య శక్తులున్నాయనే ప్రభుత్వ విమర్శను వారు ఖండించారు. ప్రభుత్వం తమను భయపెడుతోందని వారన్నారు. జీవన్ రెడ్డి కమిటీ సిఫార్సులను అమలు చేసే వరకు తాము సమ్మెను విరమించేది లేదని వారన్నారు. సమ్మెను కొనసాగించాలని జూనియర్ డాక్లర్ల సంఘం సర్వసభ్య సమావేశం కూడా నిర్ణయించింది. సమ్మె విరమిస్తామని హైకోర్టుకు హామీ ఇచ్చిన జూనియర్ డాక్టర్లు కొద్ది గంటల్లోనే అందుకు విరుద్దంగా నిర్ణయం తీసుకున్నారు.
హైకోర్టు ఆదేశాలతో రేపటి నుంచి (గురువారం నుంచి) సమ్మెను విరమించాలని జూనియర్ డాక్టర్లు నిర్ణయించుకున్నట్లు తొలుత వార్తలు వెలువడ్డాయి. సమ్మెను విరమించి, సమస్యలను తమకు వివరిస్తే తాము పరిష్కరిస్తామని హైకోర్టు చెప్పడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్లు రేపు విధుల్లో చేరుతున్నట్లు కూడా కొంత మంది నాయకులు హైదరాబాద్‌లో ప్రకటించారు.
నిరుడు తమ డిమాండ్లను అమలు చేస్తామని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చిందని, కోర్టుకు ఇచ్చిన మాటలను ప్రభుత్వం నిలబెట్టుకోలేదని జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ సురేష్ తొలుత మీడియా ప్రతినిధులతో అన్నారు. తాము దగ్గరుండి అమలు చేయిస్తామని హైకోర్టు బుధవారం హామీ ఇచ్చింది. జూనియర్ డాక్టర్ల సమస్యలను సోమవారం వింటామని కూడా తెలియజేసింది. తాము న్యాయస్థానం మీది నమ్మకంతో సమ్మెను విరమిస్తున్నామని డాక్టర్ సురేష్ చెప్పారు. తాము ప్రజా సమస్యపై పోరాటం చేస్తున్నామని, ప్రజా మద్దతు తమకే ఉన్నదని, తమ సమ్మెకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారనేది నిజం కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications