పార్టీ తీరు బాగు లేదు, పార్టీని వీడను: సిన్హా
న్యూఢిల్లీ: పార్టీ అధికార ప్రతినిధిగా తనను తొలగించిన విధానాన్ని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అసమ్మతి నాయకుడు యశ్వంత్ సిన్హా నాయకత్వాన్ని ప్రశ్నించారు. జిన్నాపై పార్టీ అధ్యక్షుడు ఎల్.కె. అద్వానీ చేసిన ప్రకటనపై, జార్ఖండ్ ప్రభుత్వ పనితీరుపై తాను పార్టీ అధికార ప్రతినిధి హోదాలో మాట్లాడలేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరణ ఇచ్చారు. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే తాను మాట్లాడనని ఆయన అన్నారు. పార్టీని వదిలివెళ్లాలనే ఆలోచన తనకు లేదని, పార్టీలోనే ఉంటూ సైద్ధాంతిక ప్రశ్నలు లేవనెత్తుతానని ఆయన అన్నారు.
తాను పార్టీ నుంచి వైదొలుగుతానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, తాను పార్టీలో ఉంటూనే సైద్ధాంతికపరమైన అంశాలను లేవనెత్తుతూనే ఉంటానని, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూనే ఉంటానని ఆయన అన్నారు. తాను మాట్లాడిన విషయాలు అద్వానీకి వ్యతిరేకమైనవి కావని, పార్టీ సైద్ధాంతిక సమస్యకు సంబంధించినవని ఆయన వివరణ ఇచ్చారు. జార్ఖండ్ ప్రజా సమస్యల గురించి మాట్లాడానే గాని ప్రభుత్వంపై చేసిన విమర్శలుగా వాటిని తీసుకోరాదని ఆయన అన్నారు. తన మాటలను పార్టీ సరైన రీతిలో స్వీకరించలేదని, స్వీకరించి ఉంటే తనను పార్టీ బాధ్యతల నుంచి తప్పించి ఉండేది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications