రాష్ట్రంలో గ్యాస్‌ గ్రిడ్‌ ఏర్పాటు యోచన: వైయస్‌

హైదరాబాద్‌: ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్యాస్‌ గ్రిడ్‌ను ఏర్పాటు చేసి గృహ వినియోగానికి, ప్లాంట్లకు, పరిశ్రమలకు గ్యాస్‌ను పంపిణీ చేయాలని అనుకుంటున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. ఢిల్లీలో జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో పాల్గొని హైదరాబాద్‌ తిరిగి వచ్చిన ఆయన బుధవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గ్యాస్‌ గ్రిడ్‌ లాంటిది ఏర్పాటు చేసుకుంటే గృహ వినియోగానికి గ్యాస్‌ను అందించే కార్యక్రమంలో పాలు పంచుకుంటామని గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. గ్యాస్‌ గ్రిడ్‌ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కలిపి గ్యాస్‌ను అందిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో వెలువడే గ్యాస్‌ను ఆధారం చేసుకుని ఈ గ్యాస్‌ గ్రిడ్‌ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నట్లు, ఈ గ్యాస్‌లో 5 శాతం రాష్ట్రానికి రాయల్టీగా లభిస్తుందని ఆయన చెప్పారు. గ్యాస్‌ అథారిటీని ఏర్పాటు చేయడానికి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సుముఖత వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ గ్యాస్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేసి గ్యాస్‌ను పంపిణీ చేసే బాధ్యతను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేట్‌ సంస్థలకు అప్పగిస్తే జనసాంద్రత ఉన్న ప్రాంతాలపైనా, పట్టణాలపైన మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తాయని, ప్రభుత్వమైతే వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పని చేస్తుందని ఆయన అన్నారు. విద్యుదుత్పాదనను ప్రైవేట్‌ కంపెనీలకు అప్పగించి, జెన్కోను నిర్వీర్యం చేసే పని జరిగిందని, అలాంటిది మంచిది కాదని ఆయన అన్నారు. లాభాల బాటలో నడుస్తున్న ప్రభుత్వ సంస్థలను మరింత బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ విధానమని ఆయన అన్నారు. జెన్కో ప్రస్తుతం చురుకుగా పని చేస్తోందని, పలు ప్రాజెక్టుల నిర్మాణంలో నిమగ్నమై ఉందని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి ప్రభుత్వం విడుదల చేసిన విజన్‌ 2020ని ఆయన విజన్‌ 420గా అభివర్ణించారు. విజన్‌ 2002 విజన్‌ 420గా మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.

విధిలేకనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచిందని ముఖ్యమంత్రి అన్నారు. ధరలు పెరగకూడదనే ప్రభుత్వం అనుకుంటుందని, ఇబ్బంది పడుతూనే మరో మార్గం లేక ధరలు పెంచిందని ఆయన అన్నారు. ముడి చమురు ధర 60 శాతం పెరిగిందని, ఆ నిష్పత్తిలో పెట్రోల్‌ డీజిల్‌ ధరలు పెరగలేదని, ఇప్పుడు కూడా పెంపుదల 32 శాతం మాత్రమే ఉందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+