కేరళ సియల్‌పిలో ముసలం: 9 మంది రాజీనామా
తిరువనంతపురం: కేరళ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ చీలిపోయింది. నేషనల్ కాంగ్రెస్ ( ఇందిర) నాయకుడు కరుణాకరన్ అనుచరులు 9 మంది తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు. వీరు నేషనల్ కాంగ్రెస్ ( ఇందిర)లో చేరారు. కాంగ్రెస్ నుంచి విడిపోయి ఆరు నెలల క్రితం కరుణాకరన్ నేషనల్ కాంగ్రెస్ ( ఇందిర) పార్టీని ఏర్పాటు చేశారు. తొమ్మిది మంది శాసనసభ్యులు రాజీనామా చేసినప్పటికీ కేరళలో ఊమెన్ చాంది నేతృత్వంలోని యుడియఫ్ ప్రభుత్వంపై ఏ విధమైన ప్రభావం పడబోదు.
కేరళ శాసనసభకు మరో 11 నెలల కాలంలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ శాసనసభ్యులు రాజీనామా చేశారు. వారు తమ రాజీనామా లేఖలను శాసనసభ స్పీకర్ తెరాంబిల్ రామకృష్ణన్‌కు అందజేశారు. చాందీ ప్రభుత్వ దుష్పరిపాలన గురించి, వైఫల్యాల గురించి తాము ప్రచారం చేస్తామని వారు చెప్పారు. చాందీకి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని వారన్నారు. వీరి రాజీనామాతో అధికార కూటమి సభ్యుల సంఖ్య 99 నుంచి 84కు పడిపోయింది. యల్‌డియఫ్‌కు శాసనసభలో 41 మంది సభ్యుల బలం ఉండగా అది ఇటీవలే 46కు పెరిగింది.
వారి రాజీనామాలను స్పీకర్ వెంటనే రాజీనామాలను ఆమోదించారు. కరుణాకరన్‌ను, యన్‌సిఐ అధ్యక్షుడు కె. మురళీథరన్‌ను సోమవారంనాడు కలిసిన అనంతరం ఆ తొమ్మిది మంది శాసనసభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications
