న్యాయం చేయండి: నవీష్ భార్య వైయస్‌కు వినతి
హైదరాబాద్: జనహర్ష అధిపతి రమణమూర్తి ఆస్తులను స్వాధీనం చేసుకుని తమకు అప్పగించాలని హత్యకు గురైన టిమ్స్ అధిపతి నవీష్‌మూర్తి భార్య పద్మావతి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిని కోరారు. రమణమూర్తి అక్రమంగా భూములను ఆక్రమించుకున్నాడని ఆమె ఆరోపించారు. తమ విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా ప్రతిస్పందించారని ఆమె మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కోరామని ఆమె చెప్పారు.
రమణమూర్తికి అనుకూలంగా పత్రికా ప్రకటనలు ఇచ్చిన వంద మంది మేధావులపై కూడా చర్యలు తీసుకోవాలని తాను ముఖ్యమంత్రిని కోరినట్లు ఆమె తెలిపారు. రమణమూర్తి ఆధ్వర్యంలోని జైభారత్ సంస్థను, విజయవిహారం పత్రికను నిషేధించాలని ఆమె ముఖ్యమంత్రిని కోరారు.
ఇదిలావుంటే, తమ అదుపులోకి తీసుకున్న రమణమూర్తిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. రమణమూర్తి అనుచరులను మరికొంతమందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నవీష్‌మూర్తి హత్య విషయంలో నేరాన్ని రమణమూర్తి అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications
