EPIC-First Semester Review: 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' మూవీ రివ్యూ.. హిట్టా.. ఫట్టా?
EPIC-First Semester Review: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'. 'బేబీ' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ కలిసి నటించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా మంచి పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యూత్‌ఫుల్ అండ్ లైఫ్ డ్రామా నేడు(సెప్టెంబర్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా వివరాల గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం.
స్టోరీ
వనపర్తి, లండన్ నేపథ్యంలో సాగే ఈ స్టోరీలో ఆదిత్య(ఆనంద్ దేవరకొండ) ఫిల్మ్ డైరెక్టర్ కావాలని కలలు కనే అమాయకపు కుర్రాడిగా కనిపిస్తాడు. కానీ అతని తల్లిదండ్రులు ఉన్నత చదువుల కోసం లండన్ పంపిస్తారు. ఊరు, సినిమా తప్పా మరో ప్రపంచం తెలియని ఆదిత్య లండన్ వెళ్తాడు. అక్కడే వైజాగ్ నుంచి వచ్చిన స్వతంత్ర భావాలు కలిగిన కడలి(వైష్ణవి చైతన్య) పరిచయమవుతుంది. ఆ ఒక్కరోజు పరిచయంలోనే ఆదిత్యతో గదిలో ఉండేందుకు వస్తుంది. ఆ వ్యవహారం ముద్దు వరకు వెళ్తుంది. 9 నెలల కోర్సు కోసం వచ్చిన ఆదిత్య, కడలిల మధ్య అనుకోకుండా ఏర్పడిన బంధం.. వారి భిన్నమైన ఆలోచనలు, ఈగోలు, వారి మధ్య వచ్చే ప్రేమానురాగాలు ఎలాంటి మలుపులు తిరిగాయన్నది తెరపై చూడాల్సిందే.

ఎవరెలా నటించారంటే?
నటీనటుల విషయానికి వస్తే.. ఆనంద్ దేవరకొండ తన అమాయకత్వంతో కూడిన పాత్రలో ఒదిగిపోయాడు. వైష్ణవి చైతన్యతో ఆయన డైలాగ్స్, కామెడీ టైమింగ్ కొన్ని చోట్ల బాగా పేలాయి. కడలి పాత్రలో వైష్ణవి చైతన్య మెప్పించింది. గతంలో చేసిన పాత్రలకు భిన్నంగా ఉన్నప్పటికీ.. తనదైన శైలిలో న్యాయం చేసింది. ప్రధాన జంట మధ్య ఉండే ఫన్, ఈగో క్లాషెస్, ఎమోషన్స్ కొన్ని చోట్ల సహజంగా అనిపిస్తాయి. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
మైనస్ పాయింట్స్
సినిమాకు అతిపెద్ద మైనస్ పాయింట్ స్టోరీ, నెమ్మదించిన వేగం. ఫస్టాఫ్, అలాగే సెకండాఫ్‌లో ఎక్కువ శాతం సీన్లు ప్రధాన జంట మధ్య ఉండే డైలాగ్స్ చుట్టూనే తిరుగుతాయి. ఇవి పదే పదే ఒకే తరహాలో సాగడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్షలా మారుతాయి. క్లైమాక్స్, ప్రీ-క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీన్లు ఉన్నప్పటికీ.. ఇవి రావడం చాలా ఆలస్యమైంది. అలాగే '90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్‌తో ఉన్న కనెక్షన్ కూడా స్టోరీకి పెద్దగా ఉపయోగపడలేదు.
సాంకేతిక వర్గం
దర్శకుడు ఆదిత్య హాసన్ మంచి ఆలోచనతో వచ్చినప్పటికీ.. స్క్రీన్‌ప్లే సరిగ్గా రాయకపోవడంతో స్టోరీ ముందుకు సాగదు. ఎడిటింగ్ ఇంకా పదునుగా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గా..
మొత్తంగా 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' అనేది లవ్ స్టోరీలను ఇష్టపడే వారిని మెప్పించే ప్రేమకథా చిత్రం. అంచనాలు లేకుండా వెళ్తే చూడదగిన చిత్రం.
*రేటింగ్: 3/5.














Click it and Unblock the Notifications
