BRICS Summit 2026: మోదీ మాటల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం!
ప్రపంచ ఆర్థిక, రాజకీయ యవనికపై శరవేగంగా మారుతున్న సమీకరణల నడుమ భారత్ మరో చారిత్రక ఘట్టానికి ఆతిథ్యమిస్తోంది. ఢిల్లీ వేదికగా జరగనున్న బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు విశ్వశాంతికి, ప్రపంచ మానవాళి సంక్షేమానికి సరికొత్త దిశను నిర్దేశిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న వేళ... ఆహారం, ఇంధనం, ఆరోగ్యం, విపత్తుల నిర్వహణ, కీలకమైన సరఫరా వ్యవస్థల పరిరక్షణే లక్ష్యంగా ఈ రెండు రోజుల సదస్సు సాగనుంది. సవాళ్లతో కూడుకున్న ప్రపంచ పరిస్థితులలో ఒక బలమైన అనుసంధానకర్తగా తన నాయకత్వాన్ని చాటుకునేందుకు భారత్ సిద్ధమైంది.
ఈ ప్రతిష్టాత్మక సదస్సు కోసం ప్రపంచ అగ్రనేతలు ఢిల్లీలో అడుగుపెడుతున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటోలతో పాటు ఈజిప్టు, మలేషియా, యూఏఈ, ఇథియోపియా, వియత్నాం దేశాల అగ్రనేతలు ఈ భేటీకి హాజరవుతున్నారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఆర్థిక ఆంక్షలు, వాణిజ్య వైరుధ్యాల నడుమ గ్లోబల్ సౌత్ దేశాల స్వరంగా బ్రిక్స్ కూటమి ఏకీకృత నిర్ణయాలు తీసుకునేందుకు ఈ సమావేశం వేదిక కానుంది.

మూడు రోజుల పర్యటనలో పుతిన్: మోదీతో నేడు కీలక భేటీ!
ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బ్రిక్స్ సదస్సు కోసం విదేశీ పర్యటనకు వచ్చి, శుక్రవారమే ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. మూడు రోజుల పాటు భారత్‌లో ఉండనున్న పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రక్షణ రంగం, ఇంధన సరఫరా, సాంకేతికత ,చెల్లింపుల వ్యవస్థలో పరస్పర సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవడమే ఈ భేటీ ప్రధాన అజెండాగా ఉంది.
కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఢిల్లీ
గ్లోబల్ లీడర్ల రాకతో దేశ రాజధాని భారత్ మంటపం పరిసరాలు ఉక్కు నగరంగా మారాయి. 15,000 మందికి పైగా ఢిల్లీ పోలీసులు, 200 కంపెనీల పారామిలటరీ బలగాలు, 500కి పైగా అత్యాధునిక సీసీటీవి కెమెరాలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. వీవీఐపీ కాన్వాయ్‌ల రాకపోకల దృష్ట్యా కేవలం తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపులు మాత్రమే ఉంటాయని, నగరంలో పౌరుల సాధారణ జీవనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
ప్రపంచ రంగాన భారత్ నాయకత్వానికి దక్కిన గుర్తింపు
ఈ బ్రిక్స్ సదస్సు ప్రపంచంలో జరుగుతున్న అంతర్గత విభేదాలను తగ్గించి, సమతుల్యతను తీసుకురావడానికి భారత్‌కు లభించిన గొప్ప అవకాశమని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. చైనా, రష్యా, ఇరాన్ సహా 11 సభ్యదేశాల అధినేతలందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా దేశాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణాన్ని తగ్గించి, ప్రపంచ అభివృద్ధికి బాటలు వేసే శక్తి భారత్‌కు ఉందని ఈ సదస్సు నిరూపిస్తోంది.














Click it and Unblock the Notifications
