నిషేధంపై ఎప్పటికప్పుడు సమీక్ష: జానారెడ్డి
నల్లగొండ: మావోయిస్టులపై, వారి అనుబంధ సంస్థలపై విధించిన నిషేధాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటామని హోం మంత్రి కె. జానారెడ్డి చెప్పారు. సాధారణ పరిస్థితులు నెలకొంటే నిషేధాన్ని ఎత్తివేసే విషయాన్ని కూడా పరిశీలిస్తామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రజాభిప్రాయం మేరకు విప్లవ రచయితల సంఘం (విరసం)పై నిషేధం తొలగించే విషయాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు. గిరిజన బెటాలియన్ ఏర్పాటు నక్సల్స్ అణచివేత కోసం ఏర్పాటు చేయడం లేదని, అవసరం ఉన్న చోట దాన్ని వాడుతామని ఆయన వివరించారు. గిరిజన బెటాలియన్‌లోకి కేవలం గిరిజనులను మాత్రమే ఎంపిక చేయబోమని, షెడ్యూల్ ప్రాంతాల నుంచి ఎంపిక జరుగుతుందని ఆయన చెప్పారు.
మీడియాపై ప్రభుత్వం ఏ విధమైన ఆంక్షలు విధించబోదని, మీడియా ప్రతినిధుల హక్కులకు భంగం కలిగించబోమని ఆయన చెప్పారు. పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నారని, చట్టప్రకారం సంక్రమించిన అధికారం మేరకే డిజిపి వ్యవహరిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. చట్టవ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తున్నట్లు తన దృష్టికి వస్తే చర్యలుత తీసుకుంటానని ఆయన చెప్పారు. నిషేధం వల్ల లాభనష్టాలు రెండూ ఉంటాయని, నిషేధం వల్ల సమస్యలు ఉత్పన్నమైనప్పుడు త్వరితగతిన చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం చేపట్టని ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తవుతాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
