మావోయిస్టులపై నిషేధం ఏకపక్షం: టిఆర్‌యస్
సూర్యాపేట: ప్రతిపక్షాలతో చర్చించుకుండా మావోయిస్టులపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) నాయకుడు, మాజీ రాష్ట్ర మంత్రి నాయని నర్సింహారెడ్డి తప్పు పట్టారు. ప్రతిపక్షాలతో చర్చించకుండా నిషేధం విధిస్తూ అంత తొందరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏం వచ్చిందని ఆయన అడిగారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఆయన సోమవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
నక్సలైట్లతో చర్చలను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం నక్సలైట్లపై నిషేధం విధించి ఏం సాధించిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధిస్తుందని ఆయన ప్రశ్నించారు. నిషేధం వల్ల ఒనగూడే ప్రయోజనం ఏమీ ఉండకపోగా కక్షలు, పగలు పెరుగుతాయని ఆయన అన్నారు. నిషేధం వల్ల సమస్య పరిష్కారం కాదని, చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందని ఆయన అన్నారు. విప్లవ రచయితల సంఘం నేతలు వరవరరావు, కల్యాణ్‌రావులను అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. వారి వల్ల ప్రభుత్వానికి తక్షణంగా ఏర్పడిన ప్రమాదం ఏమీ లేదని, అందువల్ల వారిని అరెస్టు చేయాల్సిన అవసరం ఏమీ లేదని ఆయన అన్నారు. వరవరరావు, కల్యాణ్‌రావుల అరెస్టు తనకు బాధాకరమేనని ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి అంటూనే చట్టం గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
