హైదరాబాద్‌లో స్కూల్ ఆటో బోల్తా:విద్యార్థి బలి
హైదరాబాద్: అస్తవ్యస్తమైన ట్రాఫిక్‌కు హైదరాబాద్‌లో మరో పాఠశాల విద్యార్థి బలయ్యాడు. ఇటీవలే ఒక విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో గురువారం ఉదయం హైదరాబాద్‌లోని హైదర్‌గూడా ప్రాంతంలో బోల్తా పడడంతో సుచిత్ బార్గవ్ అనే విద్యార్థి మరణించాడు. బషీర్‌బాగ్ వైపు నుంచి పది మంది విద్యార్థులతో కింగ్‌కోఠీలో సెయింట్ జోసెఫ్ స్కూలు వైపు వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తా పడింది. సుచిత్ అనే విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, మరో తొమ్మిది గాయాల పాలై ఆస్పత్రి పాలయ్యారు. సుచిత్ సోదరుడు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డాడు.
తలకు బలమైన గాయం తగలడంతో సుచిత్ మరణించాడు. తమ చిన్నారి మరణంతో సుచిత్ తలిదండ్రుల బాధ వర్ణనాతీతంగా ఉంది. వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ట్రాఫిక్ సూచనలను ఎవరూ పాటించడం లేదని, ఆటోలో ఆరుగురు విద్యార్థులకు మించి ఎక్కించుకోవద్దని చెప్పినా వినడం లేదని ట్రాఫిక్ ఉన్నతాధికారి ఎ.కె. ఖాన్ అంటున్నారు. తలిదండ్రుల అవగాహనా రాహిత్యం వల్ల, యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరి వల్ల ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులను పంపుతున్నారని ఆయన అన్నారు. సెప్టెంబర్ రేపటి నుంచి ఆరుగురు విద్యార్థులకు మించి తీసికెళ్లే ఆటోలపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
బోల్తా పడిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆటో డ్రైవర్‌పై, పాఠశాల యాజమాన్యంపై కేసులు నమోదు చేసినట్లు నగర పోలీసు కమీషనర్ దినేష్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications
