ప్రాజెక్టుల్లో అవినీతికి రుజువులేవి?: వైయస్
కరీంనగర్: రాష్ట్రంలోని 16 సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చ నిర్వహిస్తే ఒక్క అవినీతి ఆరోపణను కూడా తెలుగుదేశం పార్టీ రుజువు చేయలేకపోయిందని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారంనాడు ఆయన కరీంనగర్ జిల్లాలో రాజీవ్ నగరబాట నిర్వహించారు. నక్సల్స్‌పై నిషేధం విధించిన తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాలో ఆయన పర్యటించడం ఇదే మొదటిసారి. కరీంనగర్‌లో హెలికాప్టర్ దిగిన వెంటనే ఆయన బులెట్ ప్రూఫ్ జాకెట్ ధరించారు. నగరబాట సందర్భంగా ఆయన పలుచోట్ల ప్రసంగించారు.
సాగునీటి టెండర్ల ఖరారులో అవకతవకలు జరిగాయనే తెలుగుదేశం పార్టీ నేతల విమర్శలు అర్థరహితమని ఆయన అన్నారు. ఐదేళ్లలో 65 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని ఆయన చెప్పారు. ప్రాణహిత నది నీటిని అందించి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తుంటే తమకు పుట్టగతులుండవనే భయంతో తెలుగుదేశం నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. చట్టం వల్ల ఎదరువుతున్న ఇబ్బందుల వల్ల 1998 డియస్‌సి అభ్యర్థులకు ఉద్యోగ నియామకాలు ఇవ్వలేమని ఆయన తేల్చి చెప్పారు.
ఎన్ని అవాంతరాలు ఎదురైనా తన హయాంలోనే సాగునీటి ప్రాజెక్టులను అన్నింటీని పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి వుంటే ఇన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ఉండేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరి పని వారు చేసుకుపోతే ఏ సమస్యలూ ఉండవని ఆయన అన్నారు. ఇక నుంచి జర్నలిస్టుల స్వేచ్ఛకు ఏ విధమైన భంగం వాటిల్లదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
