ఉద్యోగులు అర్థం చేసుకుంటారనే ఆశ ఉంది: వైయస్
హైదరాబాద్: వేతన సవరణపై తమ స్థితిని ప్రభుత్వోద్యోగులు అర్థం చేసుకుంటారనే ఆశ తనకు ఉందని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఖజానా స్థితి ఏమిటో ప్రభుత్వోద్యోగులకు తెలుసునని, అందువల్ల పరిస్థితిని అర్థం చేసుకుంటారనే ఆశ తనకు ఉన్నదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వేతన సవరణపై ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య ఇప్పటి వరకు నాలుగు దఫాలు చర్చలు జరిగాయి.
ఇరుపక్షాలు కూడా తమ పట్టును కొంత సడలించుకోవడంతో తదుపరి చర్చలు కొలిక్కి రాగలవని ఆశిస్తున్నారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగస్వాములేనని, ఎన్‌జివోలు ప్రభుత్వంలో ముఖ్యమైన భాగస్వాములని ఆయన అన్నారు. వేతన సవరణపై తమ డిమాండ్లను అంగీకరించకపోతే వచ్చే నెల 5వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ హెచ్చరించింది.












Click it and Unblock the Notifications
