4గురు నకిలీ కంటి వైద్యుల అరెస్టు
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని కుషాయిగుడా పోలీసులు నలుగురు నకిలీ కంటి వైద్యులను అరెస్టు చేశారు. తాము కంటి వైద్యులమని చెప్పి లయన్స్ క్లబ్ ప్రతినిధిగోపాల్ రెడ్డిని మోసగించేందుకు వారు ప్రయత్నించారు. గోపాల్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ నలుగురిని అరెస్టు చేశారు.
వివరాలు ఇలా ఉన్నాయి: నలుగురు వ్యక్తులు గోపాల్ రెడ్డి వద్దకు వచ్చి తాము హైదరాబాద్‌లోని సరోజినీదేవి కంటి ఆస్పత్రి వైద్యులమని, ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తే తాము కంటి పరీక్షలు చేస్తామని చెప్పారు. అందుకు గోపాల్ రెడ్డి అంగీకరించాడు. అయితే తమకు 4 లక్షల రూపాయలు ఇవ్వాలని వారు పట్టుబట్టారు. అయితే గోపాల్ రెడ్డి అందుకు అంగీకరించలేదు. కనీసం 2 లక్షల రూపాయలైనా ఇవ్వాలని వారు బేరానికి దిగారు. దీంతో గోపాల్ రెడ్డికి అనుమానం వచ్చి సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో ఆరా తీశారు. దాంతో అటువంటి వైద్యులెవరూ సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో లేరని తేలింది. దాంతో అతను కుషాయిగుడా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు కూడా సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో ఆరా తీశారు. గోపాల్ రెడ్డికి లభించిన సమాచారమే పోలీసులకూ అందింది. దీంతో పోలీసులు ఆ నలుగురిని అరెస్టు చేశారు. అయితే తాము డిప్లమా చేశామని, తమ పరీక్షల వల్ల ఎవరికీ ఏ విధమైన హామీ జరగదని ఆ నకిలీ కంటి వైద్యులు ఇప్పటికీ అంటున్నారు.












Click it and Unblock the Notifications
