వైయస్ భద్రతకు ఢోకా ఏమీ లేదు: డిజిపి
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి భద్రత విషయంలో ఏ విధమైన ఢోకా లేదని పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్పష్టం చేశారు. రాజశేఖర్ రెడ్డిని, ఇతర ప్రముఖులను టార్గెట్ చేసుకని మావోయిస్టు యాక్షన్ టీమ్‌లు రంగంలోకి దిగాయనే ఇంటలిజెన్స్ సమాచారం అందిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మావోయిస్టుల యాక్షన్ టీమ్‌ల వ్యవహారం కొత్తదేమీ కాదని డిజిపి బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి భద్రతకు ఏ విధమైన ఇబ్బందులు లేవని ఆయన అన్నారు. నక్సల్స్ నుంచి ముప్పు ఉన్న ప్రముఖులందరికీ తగిన భద్రత కల్పిస్తున్నామని ఆయన చెప్పారు.
నక్సలైట్లను అణచివేసే సత్తా తమకు ఉన్నదని, అయితే కేంద్ర బలగాలు వస్తే స్వాగతిస్తామని ఆయన చెప్పారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్‌కు బెదిరింపులు వచ్చిన సమాచారం తమకు మహారాష్ట్ర పోలీసులు అందించారని ఆయన చెప్పారు. అజర్‌కు బెదిరింపులు వచ్చిన వ్యవహారంలో పాకిస్థాన్ ఇంటలిజెన్స్ సంస్థ ఐయస్‌ఐ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవని ఆయన అన్నారు. జనశక్తి రాష్ట్ర కమిటీ అమర్ విషయం తనకేమీ తెలియదని, అమర్ పోలీసు నిర్బంధంలో ఉంటే సంతోషమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
