వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరుమరుగయ్యేది వైయస్‌యే, తెలంగాణ కాదు: కెసిఆర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెరమరుగయ్యేది తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ కాదని, ముఖ్యమంత్రి వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డియేనని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌) అగ్రనేత, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్‌ రావు వ్యాఖ్యానించారు. రాజశేఖర్‌ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి పట్టిన గతే పడుతుందని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ నినాదం కనుమరగువుతుందని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి బుధవారం జాతీయ భద్రతా మండలి సమావేశంలో చేసిన వ్యాఖ్యపై చంద్రశేఖర్‌ రావు తీవ్రంగా మండిపడ్డారు.

తమ పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులతో కలిసి ఆయన గురువారం ఉదయం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. నక్సల్స్‌తో చర్చలను పునరుద్ధరించడానికి జోక్యం చేసుకోవాలని ఆయన సోనియాను కోరడంతో పాటు రాజశేఖర్‌ రెడ్డి వైఖరిపై ఫిర్యాదు చేశారు. సోనియాతో భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిని గద్దె దించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు సమాయత్వం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు జాగరణసేన తన కార్యకలాపాలను ఉధృతం చేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.

నక్సలైట్లతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలను పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. శ్రీలంకలో విదేశాంగ మంత్రిని హత్య చేసిన తర్వాత కూడా ప్రభుత్వం ఎంతో సయమనంతో, సహనం వహించి తమిళ టైగర్లను చర్చలకు ఆహ్వానించిందని, చరిత్రలో ఇటువంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయని, అటువంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నక్సల్స్‌తో చర్చలు జరపడం అవసరమని గుర్తించాలని ఆయన అన్నారు. కంటికి కన్ను పంటికి పన్ను అనే పద్ధతిని ప్రభుత్వం అనుసరించడం సరి కాదని ఆయ అన్నారు. అదనపు ఆయుధాలు, అదనపు బలగాలు నక్సల్స్‌ సమస్యను పరిష్కరించలేవని, ఇప్పుడు కావాల్సింది అదనపు వనరులు, అదనపు ఆలోచనలు అని ఆయన అన్నారు. తుపాకితో నక్సల్స్‌ సమస్యను పరిష్కరించలేమని దశాబ్దాల అనుభవం తెలియజేస్తూనే ఉందని, ఇంకా ఆయుధాలతో పరిష్కరిస్తామంటే ఆదిమ యుగంనాటి పద్ధతి అవుతుంది తప్ప మరోటి కాదని ఆయన అన్నారు. నక్సల్స్‌ సమస్యను పరిష్కరించడానికి కావాల్సింది రాజకీయం కాదని, రాజనీతిజ్ఞత అని ఆయన అన్నారు.

నక్సల్స్‌ అణచివేత పేరుతో చేపడుతున్న కార్యక్రమాల వల్ల తెలంగాణ గ్రామాల్లో యువకులు ఉండలేని పరిస్థితి నెలకొందని, వందలాది మంది యువకులను పోలీసులు స్టేషన్లకు పిలిపించి వేధిస్తున్నారని, ఏడేళ్ల తర్వాత వర్షాలు కురిశాయని, ఈ స్థితిలో వ్యవసాయం చేసుకుందామంటే గ్రామాల్లో ఉండలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. భీతావహ వాతావరణాన్ని ప్రజలు ఎన్ని దశాబ్దాలు అనుభవించాలి, వారికి ఇదేం కర్మ అని ఆయన అడిగారు. సమస్య ప్రభుత్వానికో, నక్సల్స్‌కో సంబంధించింది కాదని, ప్రజలకు సంబంధించిందని, అందువల్ల సమస్య పరిష్కారానికి బాధ్యతయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. నర్సా కోబ్రాస్‌ను, కాకతీయ కోబ్రాస్‌ను ప్రోత్సహించడం సరి కాదని ఆయన అన్నారు.

ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ)లో కొనసాగే విషయమై భాగస్వామ్య పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. నక్సల్స్‌తో చర్చలు జరుపుతామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా హామీ ఇచ్చిందని, ఒక తంతుగా ఒకసారి మాత్రమే చర్చలు జరిపి చేతులు దులిపేసుకుందని ఆయన అన్నారు. నక్సల్స్‌తో చర్చలు జరపాల్సింది హోం మంత్రి కాదని, రెవెన్యూ, సంక్షేమ శాఖల మంత్రులు చర్చలు జరపాలని ఆయన అన్నారు.

తెలంగాణపై ఈ నెల 8వ తేదీన యుపి ఎ భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరపనున్నట్లు చంద్రశేఖర్‌ రావు తెలిపారు. తమ పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులతో కలిసి ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌ను కలిశారు. ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి తీరును శరద్‌పవార్‌ దృష్టికి తెచ్చామని ఆయన చెప్పారు. ఈ నెల 8,9 తేదీల్లో మిగతా మిత్రపక్షాలతో కూడా చర్చించిన తర్వాత చర్చించి నిర్ణయించుకోవచ్చునని శరద్‌పవార్‌ చెప్పినట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X