8న ఆర్టీసి కార్మికుల సమ్మె నోటీసు
హైదరాబాద్: తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవచూపకపోవడాన్ని నిరసిస్తూ సమ్మె తప్ప మరో మార్గం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపియస్ ఆర్టీసి) కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) నిర్ణయించుకుంది. ఈ నెల 8వ తేదీన నోటీసు ఇవ్వాలని జె ఎసి నిర్ణయించింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్లీనరీ సమావేశాలు జరిగే సమయానికి సమ్మె చేసేలా ఈ నోటీసు జారీ చేయాలని జె ఎసి నాయకులు నిర్ణయించుకున్నారు. దీని వల్ల తమ సమస్యలు జాతీయ స్థాయి దాకా వెళ్లే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. బుధవారం ప్రభుత్వంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో సమ్మెకు దిగాలని వారు నిర్ణయించుకున్నారు.
పరిస్థితిని అర్థం చేసుకుని కార్మికులు సహకరిస్తారని, సమ్మెకు దిగబోరని ఆశిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ అన్నారు. ఆర్టీసీ పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరగువుతోందని, కార్మికులు సమ్మెకు దిగితే చక్కబడుతున్న పరిస్థితి మరింత దిగజారుతుందని, ఈ విషయాన్ని కార్మికులు గుర్తిస్తారని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు.
ఈ నెల 3వ తేదీననే సమ్మె నోటీసు ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు మొదట అనుకున్నారు. అయితే కాంగ్రెస్ ప్లీనం జరిగేనాటికి సమ్మె జరిగేలా నోటీసలు ఇవ్వాలనే ఆలోచనతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అయితే ఈ విషయాన్ని జె ఎసి నాయకులు ఒప్పుకోవడం లేదు. పండుగలున్నందున ప్రజలకు ఇబ్బంది కలగకుండా పండగలన్నీ ముగిసిన తర్వాత సమ్మెకు దిగాలనే ఉద్దేశంతో తమ నిర్ణయాన్ని మార్చుకున్నామని వారంటున్నారు. ప్రభుత్వ తీరుపై ఈ లోగా ప్రజలకు వివరించనున్నట్లు వారు తెలిపారు.












Click it and Unblock the Notifications
