కోటి మంది వైయస్‌లైనా అడ్డుకోలేరు: కెసిఆర్
న్యూఢిల్లీ: కోటి మంది వైయస్‌లు వచ్చినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అడ్డుకోలేరని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఎవరో వస్తారని, ఎవరో సహాయం చేస్తారని తాము ఉద్యమాన్ని ప్రారంభించలేదని, తెలంగాణ ఏర్పడేవరకు పోరాటం చేయాలనే దిగామని ఆయన అన్నారు. తెలంగాణ అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చకు తెచ్చేంత ప్రభావం వేశామని ఆయన అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సిపిఐతో పొత్తు పెట్టుకునే విషయాన్ని మాత్రం పరిశీలిస్తున్నామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. హైదరాబాద్‌కు వెళ్లిన తర్వాత ఈ విషయమై చర్చలు జరుపుతామని ఆయన చెప్పారు. అక్టోబర్ 28వ తేదీన హైదరాబాద్‌లో తమ జనజాగరణ సేన సభను నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సమితి జనజాగరణ సేన సభ మహా సైనిక సమ్మేళన్ పేర సికింద్రాబాద్‌లోని పరేడు గ్రౌండ్స్‌లో జరుగుతుందని ఆయన చెప్పారు. జనజాగరణ సేన సభ్యులు తెల్లప్యాంట్, తెల్ల షర్టు వేసుకుంటారని ఆయన చెప్పారు. సేన కార్యకలాపాలకు తెలంగాణ భవనాన్ని వినియోగిస్తామని ఆయన చెప్పారు. ప్రతి సభ్యుడి నుంచి 500 రూపాయల చొప్పున వసూలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సేన సభ్యులకు ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల అధ్యాపకులు సైద్ధాంతిక శిక్షణను అందిస్తారని ఆయన చెప్పారు. వారికి యుద్ధశిక్షణ కూడా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వీరికి యుద్ధ శిక్షణ ఇచ్చేందుకు ఉమాకాంతరావు ఛీఫ్ కమాండర్‌గా వ్యవహరిస్తారని ఆయన చెప్పారు. రాజకీయ పదవులు ఆశించకుండా వారు పని చేస్తారని ఆయన చెప్పారు. గ్రామగ్రామాన ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు వారు కృషి చేస్తారని ఆయన చెప్పారు.
తెలంగాణ నినాదం కనుమరుగవుతుందని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు, టిఆర్‌యస్‌కు మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. వైయస్ వైఖరిపై చంద్రశేఖర్‌రావు గురువారంనాడు తీవ్రంగా మండిపడ్డారు. ఈ స్థితిలో కాంగ్రెస్‌తో టిఆర్‌యస్ తెగదెంపులు చేసుకున్నట్లే. యుపిఎ ప్రభుత్వంలో కొనసాగేదీ లేనిదీ ఈ నెల 8వ తేదీన తెలంగాణను సమర్థిస్తున్న యుపిఎ భాగస్వామ్య పక్షాలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చంద్రశేఖర్ రావు ఇదివరకే ప్రకటించారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరి పోరు చేస్తామని కెసిఆర్ ప్రకటనపై హైదరాబాద్‌లో వివరణలు ఇవ్వడం మొదలైంది. వార్డులు, డివిజన్ల వరకే తాము ఒంటరి పోరు చేస్తామని, మేయర్, చైర్‌పర్సన్ పదవులకు కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తామని మాజీ రాష్ట్ర మంత్రి, టి ఆర్‌యస్ నాయకుడు నాయని నర్సింహారెడ్డి హైదరాబాద్‌లో చెప్పారు.












Click it and Unblock the Notifications
