లెఫ్ట్, కాంగ్రెస్: విజయవాడలో ఎవరిదారి వారిదే
విజయవాడ: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు, వామపక్షాలకు మధ్య బెడిసికొట్టింది. సీట్ల సర్దుబాటుపై అవగాహన కుదరకపోవడంతో ఎవరికి వారే ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు సిపిఐ, సిపియం నాయకులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. గురువారంనాటి నుంచి ఇరు పక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 59 డివిజన్లు ఉన్నాయి. ఇందులో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు 16 డివిజన్లకు మించి ఇచ్చేది లేదని కాంగ్రెష్ తేల్చి చెప్పింది. దీనికి వామపక్షాలు ససేమిరా అన్నాయి. మొదట 14 డివిజన్లు మాత్రమే ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఒక మెట్టు దిగి 16 డివిజన్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే వామపక్షాలు సగం డివిజన్లు అడుతున్నారు. ఇది కాంగ్రెస్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ పదవిని చేజిక్కించుకునే ఉద్దేశంతో కాంగ్రెస్ వామపక్షాల డిమాండ్‌కు తలొగ్గడం లేదని అంటున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే అవగాహనతో విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తాయి. వామపక్షాలు 24 డివిజన్లు, మేయర్ పదవి తమకు కేటాయించాలని వామపక్షాలు పట్టుబట్టాయి. అందుకు కాంగ్రెస్ అంగీకరించలేదు. దీంతో స్నేహపూర్వక పోటీకి సిద్ధపడాలని ఉభయ పక్షాలు నిర్ణయించుకున్నాయి.












Click it and Unblock the Notifications
