వివిని కెసిఆర్ కలుసుకోవడం తప్పేం కాదు: కెకె
హైదరాబాద్: నిషేధిత విప్లవ రచయితల సంఘం (విరసం) నాయకుడు వరవరరావును తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్ రావు జైలులో కలుసుకోవడంలో తప్పేమీ లేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అన్నారు. వివిని చంద్రశేఖర్‌రావు కలవడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అభ్యంతరం తెలిపారు. నిషేధిత సంస్థకు చెందినవారిని కలుసుకోవడం చట్టప్రకారం తప్పయితే తప్పేనని, అయితే ఆరోగ్యం గురించి వాకబు చేయడంలో తప్పు లేదని కేశవరావు అన్నారు.
నిషేధిత సంస్థల వ్యక్తులను ఇంటర్వ్యూ చేయడం తప్పని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన తెలంగాణ జాగరణ సేన తెలంగాణ కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సేన అని పేరున్నంత మాత్రాన తప్పులేదని, అయితే ప్రజాస్వామ్య పద్దతిలో అది పోరాటం చేయాలని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులు త్వరలో ఖరారవుతాయని ఆయన చెప్పారు. విజయవాడలో కాంగ్రెస్ వర్గాల మధ్య పోరు కుటుంబ సమస్య అని ఆయన అభివర్ణించారు.












Click it and Unblock the Notifications
