వరంగల్ జడ్‌పి చైర్మన్ బస్వారెడ్డి బర్తరఫ్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ బస్వారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. అవినీతి, నిధుల మళ్లింపు ఆరోపణలపై ప్రభుత్వం ఆయనను బర్తరఫ్ చేసింది. 2005 -06 ఆర్థిక సంవత్సరం నిధులను బడ్జెట్ ఆమోదం లేకుండానే బస్వారెడ్డి వాడారనే ఆరోపణపై ప్రభుత్వం ఆ చర్యకు పాల్పడింది. ఈ ఆరోపణలపై వరంగల్ జిల్లా పరిషత్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇవో) ఆశీర్వాదాన్ని ప్రభుత్వం ఇదివరకే సస్పెండ్ చేసింది. బస్వారెడ్డిపై తెలుగుదేశం పార్టీకే చెందిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సమ్మారావు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ కుట్ర చేసి తనను బర్తరఫ్ చేసిందని, దీన్ని తాను కోర్టులో సవాల్ చేస్తానని బస్వారెడ్డి చెప్పారు. బస్వారెడ్డిని బర్తరఫ్ చేయడం అప్రజాస్వామిక చర్య అని తెలుగుదేశం పార్టీ నాయకుడు కడియం శ్రీహరి విమర్శించారు. బస్వారెడ్డి బర్తరఫ్ రాజకీయ కక్షతో కూడుకున్నదని, రాజకీయపరమైందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు బస్వారెడ్డి ఇదివరకే సమాధానం ఇచ్చారని, ఆ సమాధానం సంతృప్తికరంగానే ఉన్నదని భావించామని ఆయన అన్నారు. ఆరోపణలను పూర్తిగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
