మేం ఓడితే నాదే బాధ్యత: కేశవరావు
విశాఖపట్నం/ విజయనగరం: మున్సిపల్ ఎన్నికల్లో తాము ఓడిపోతే దానికి బాధ్యత తనదేనని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అన్నారు. ఆయన బుధవారంనాడు ఉత్తరాంధ్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల విశ్వాసమే మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీకి విజయం చేకూర్చి పెడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము మెజారిటీ మున్సిపాలిటీలను గెలుచుకుంటామని ఆయన అన్నారు.
ప్రజల సంక్షేమం కోసం తాము ఐదు వేల కోట్ల రూపాయలైనా అప్పులు చేస్తామని ఆయన చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు ప్రభుత్వ తీరుపై రెఫరెండం అని భావిస్తే తాను చేసిన సవాల్‌కు తెలుగుదేశం పార్టీ ముందుకు రావాలని, ఈ ఎన్నికల్లో తాము ఓడిపోతే తాను పార్టీ పదవికి రాజీనామా చేస్తాననే విషయానికి కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. ప్రజా సంక్షేమానికి ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు.
తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబునాయుడు ఇస్తున్న హామీలను నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను అమలు చేయడానికి నడుం బిగించిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
