సిగ్గుంటే తెలంగాణ నేతలు వైయస్‌ను వీడాలి: నరేంద్ర
హైదరాబాద్: సిగ్గు, నెత్తురు ఉంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డికి పాదక్రాంతం చేయడం మాని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడేందుకు ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్) నేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోబోనని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 49 మంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వారి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తమ పార్టీ పుట్టక ముందు వినతిపత్రం సమర్పించారని, దాన్ని అప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడుగా ఉన్న డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఎందుకు వెనకకు తగ్గుతున్నారని ఆయన అడిగారు.
సమైక్యాంధ్ర గురించి మాట్లాడుతున్న వై.యస్. రాజశేఖర్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వీడి తెలంగాణ కోసం పోరాటం చేయాలని ఆయన అన్నారు. తెలంగాణకు మద్దతిస్తే బిజెపితో చేతులు కలపడానికి తాము సిద్ధమేనని ఆయన అన్నారు. కోబ్రాస్ చేసే దాడుల నుంచి తెలంగాణ జాగరణ సేన తమకు రక్షణ కల్పిస్తుందని ఆయన చెప్పారు. కోబ్రాస్‌ను రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిందనేది తమ అనుమానమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
