టిఆర్‌యస్ నేతలపై ఫిర్యాదు చేయలేదు: వైయస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్) నేతలు కె. చంద్రశేఖర్ రావు, ఎ. నరేంద్ర తనకు మంచి మిత్రులని, వారిపై వ్యక్తిగతంగా తాను ఎవరికీ ఫిర్యాదు చేయలేదని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. టిఆర్‌యస్ నేతలపై తాను ఢిల్లీలో ఫిర్యాదు చేసినట్లు వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. మావోయిస్టులతో టిఆర్‌యస్‌కు సంబంధాలున్నాయని తాను నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చెప్పినట్లు వచ్చిన వార్తలు నిజం కాదని ఆయన అన్నారు. అటువంటి ఆరోపణ తాను చేయలేదని ఆయన అన్నారు.
సమావేశంలో తాను టిఆర్‌యస్‌పై నిప్పులు చెరిగినట్లు, నక్సల్స్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు వచ్చిన వార్తలు పూర్తి అబద్ధాలని ఆయన చెప్పారు. తాను ఏ విధమైన పవర్ ప్రజెంటేషన్ ఇవ్వలేదని, రాష్ట్రం నుంచి అటువంటి పవర్ ప్రజెంటేషన్ ఎవరూ ఇవ్వలేదని ఆయన చెప్పారు. రాష్ట్ర ఇంటలిజెన్స్ శాఖ కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరోకు పంపిన నివేదిక లీక్ అయి వుంటుందని ఆయన అన్నారు. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్పాల్సిన వసరం తనకు లేదని ఆయన అన్నారు.
మున్సిపల్ ఎన్నికల తర్వాత తెల్లరేషన్ కార్డులను తీసేస్తారనే తెలుగుదేశం పార్టీ ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. వరంగల్, ఆదిలాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెల్లరేషన్ కార్డులు ఎత్తేస్తారనే తెలుగుదేశం ప్రచారాన్ని తిప్పి కొట్టాలని ఆయన ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications
