అద్వానీ డిమాండ్ పనికి మాలింది: కాంగ్రెస్, సిపిఐ
న్యూఢిల్లీ: మిత్రోఖిన్ ఆరోపణలపై న్యాయవిచారణ జరిపించాలని, విదేశీ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు ఎల్.కె. అద్వానీ చేసిన డిమాండ్‌ను కాంగ్రెస్, సిపిఐలు వ్యతిరేకించాయి. మిత్రోఖిన్ చేసిన ఆరోపణలు దశాబ్దాల కిందటివని, వాటికి క్రెడిబిలిటీ లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనందశర్మ పిటిఐ వార్తా సంస్థతో అన్నారు. బాధ్యతాయుతమైన నాయకత్వమేదీ మిత్రోఖిన్ ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఒక విషయానికైనా దాని స్వభావం, సమయం అతి ముఖ్యమని ఆయన అన్నారు.
అద్వానీ తన సంస్థాగత వ్యవహారాలపై దృష్టి పెడితే మంచిదని ఆయన అన్నారు. బిజెపి తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్‌డి ఎ) ప్రభుత్వ హయాంలో కుంభకోణాల్లో మునిగిపోయిందని ఆయన విమర్శించారు.
బిజెపి రాజకీయంగా, సైద్ధాంతికంగా, సంస్థాగత తీవ్ర సంక్షోభంలో ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి డి. రాజా అన్నారు. అద్వానీపై జాలి వేస్తోందని, తన సంస్థలోనే అద్వానీకి స్థానం తగ్గిందని, మృత అశ్వాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. పూర్తి నిరాధారమైన ఆరోపణలను అద్వానీ లేవనెత్తుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications