దళిత, గిరిజనుల సమస్యలపై తెరాస వాకౌట్
హైదరాబాద్: దళితులకు, గిరిజనులకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సోమవారం శాసనసభ నుంచి వాకౌట్ చేసింది. గిరిజనులు, దళితుల పట్ల ప్రభుత్వ వైఖరికి తెలుగుదేశం పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దళితులు, గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆయన పార్టీలు విమర్శించాయి.
ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటు ఒక వైపు చెబుతూ మరో వైపు గిరిజనుల, దళితుల సంక్షేమానికి ప్రభుత్వం గండి కొడుతోందని తెరాస శాసనసభా పక్ష నాయకుడు విజయరామారావు విమర్శించారు. దళితవాడల్లో, గిరిజన ప్రాంతాల్లో పేదరికం, ఆకలిదప్పులు విలయతాండవం చేస్తున్నాయని, బడ్జెట్ కేటాయింపుల్లో 15, 7 శాతం వాటికి దక్కాల్సి వుండగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన అన్నారు. గిరిజన, దళిత ప్రాంతాల్లో కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని, బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వం అన్యాయం చేసిందని తెలుగుదేశం సభ్యుడు టి. దేవేందర్ గౌడ్ విమర్శించారు.












Click it and Unblock the Notifications