హాస్యనటుడు ఐరన్‌లెగ్ శాస్త్రి మృతి
హైదరాబాద్: ప్రముఖ సినీ హాస్య నటుడు ఐరన్ లెగ్ శాస్త్రి ఆదివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఐరన్ లెగ్ శాస్త్రి అసలు పేరు గమపూడి విశ్వనాథ శాస్త్రి. పౌరోహిత్యం కోసం ఆయన తన పేరును గణపతి శాస్త్రిగా మార్చుకున్నారు. ప్రేమఖైదీతో ఆయన సినీ రంగంలో ప్రవేశించారు. అప్పుల అప్పారావు సినిమాతో తాను పోషించిన పాత్రకు నవ్వుల హరివిల్లు పండించి ఐరన్‌లెగ్ శాస్త్రిగా పేరు పొందారు. అదే పేరుతో ఆయన ప్రసిద్ధి పొందారు. గత నాలుగేళ్లుగా ఆయన సినీ రంగానికి దూరంగా ఉన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన ఐరన్ లెగ్ శాస్త్రికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఆయనకు 44 యేళ్లు. 16 యేళ్ల క్రితం సినీరంగంలో ప్రవేశించిన ఐరన్ లెగ్ శాస్త్రి 150కి పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తారు. బోదకాలు వ్యాధితో బాధపడుతున్న శాస్త్రి గత నాలుగేళ్లుగా తన పాత వృత్తి పౌరోహిత్యం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఐరన్‌లెగ్ శాస్త్రి మృతి సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది.












Click it and Unblock the Notifications
