వరద సాయంలో ప్రభుత్వం విఫలం: రాఘవులు
విజయవాడ: వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు విమర్శించారు. వరద తాకిడి ప్రాంతాల్లో ఆయన మంగళవారంనాడు పర్యటించి బాధితులను పరామర్శించారు. వరదలను పెను విపత్తుగా భావించి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు మూడు వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరదతాకిడి ప్రాంతాల్లో సంభవించిన మరణాలను కూడా ప్రభుత్వం తక్కువ చేసి చూపుతోందని ఆయన అన్నారు.
వరద నష్టంపై అధికారులు కాకి లెక్కలు చెప్పుతున్నారని ఆయన విమర్శించారు. వరద బాధితులకు దీర్ఘకాలిక సహాయం అటుంచి తక్షణ సహాయం కూడా సరిగా అందడం లేదని ఆయన విమర్శించారు. తాము ప్రత్యేక ఆర్థిక మండళ్లకు వ్యతిరేకం కాదని, అయితే నిర్వాసితులకు నష్టపరిహారం సరిగా అందాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లపేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన విమర్శించారు. రైతులను అణచివేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులను ప్రోత్సహించే పద్ధతిని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాన్ని ఖరారు చేసేందుకు ఈ నెల 10వ తేదీన వామపక్షాలు సమావేశమవుతాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications