సబ్ రిజిస్ట్రార్ దామోదర్ ఇంటిపై ఎసిబి దాడి
విశాఖపట్నం: శ్రీకాకుళం జిల్లా పాలకొండ సబ్ రిజిస్ట్రార్ రెడ్డి దామోదర్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు శుక్రవారం ఉదయం దాడి చేశారు. విశాఖపట్నంలోని రాంనగర్ లో గల ఆయన ఇంటిలో వారు సోదాలు నిర్వహించారు. ఆయన కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఈ సోదాల్లో బయటపడింది. విశాఖలో సబ్ రిజిస్ట్రారుగా పనిచేసిన దామోదర్ ఇటీవలే పాలకొండకు బదిలీ అయ్యారు.
దామోదర్ కు బంధువైన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ గోవిందరాజులు ఇంటిలో ఎసిబి అధికారులు ఈ నెల 12వ తేదీన సోదాలు నిర్వహించారు. అదే భవంతిలోని పై అంతస్థులో దామోదర్ ఉంటున్నారు. అప్పటి నుంచే దామోదర్ పై కూడా ఎసిబి అధికారులు ఓ కన్నేసి ఉంచారు. కొంత సమాచారం సేకరించిన తర్వాతనే వారు దామోదర్ ఇంటిలో సోదాలు చేశారు. ఆయన ఇంటిపైనే కాకుండా తల్లిదండ్రులు, ఇద్దరు మేనమామలు, అటెండర్ ఇళ్లపై కూడా ఎసిబి అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. దామోదర్ ఒక ఇల్లు, ఆరు ఇళ్ల స్థలాలు, పెద్ద యెత్తున బంగారం, బ్యాంకుల్లో లక్షల రూపాయల నగదు ఉన్నట్లు సోదాల్లో బయటపడింది.












Click it and Unblock the Notifications