తెలంగాణలో కెసిఆర్ బస్సు యాత్ర
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఈ ఏడాది డిసెంబరులో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చెప్పారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ సమావేశాలు తెలంగాణలో విఫలమవుతున్నాయని, మోసం చేసిందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పై ప్రజలు కోపంగా ఉన్నారని, ఈ రెండు పార్టీలకు తెలంగాణ ప్రజలు శిక్ష వేస్తారని ఆయన అన్నారు. 610 జీవో వంటి సమస్యలపై రెండు పార్టీలు కూడా నాటకాలు ఆడుతున్నాయని ఆయన విమర్శించారు.
గిరిజనులు, ముస్లింల మద్దతు కూడగట్టుకోవడానికి చేపట్టే కార్యక్రమాన్ని ఆయన ప్రకటించారు. నవంబర్ 1వ తేదీన దేవరకొండలో, 2వ తేదీన మహబూబాబాదులో గిరిజన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నవంబరు 6వ తేదీన శ్రీరాంసాగర్ వరద కాలువ (ఎస్సార్పీయస్) సామర్థ్యం పెంచాలని డిమాండు చేస్తూ ఆందోళన చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. గ్రేటర్ హైదరాబాదులో పార్టీ ఇన్ చార్జీలు 150 డివిజన్లలో పార్టీని ఇంటింటికీ తీసుకెళ్లే కార్యక్రమం చేపడుతారని ఆయన చెప్పారు. విద్యార్థులకు డివిజన్ స్థాయి అవగాహనా సదస్సులు జరుగుతాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత తన బస్సు యాత్ర ప్రారంభమవుతుందని, బస్సు సిద్ధమవుతోందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications