ఆరు నెలల్లో రెండు రూపాయల బియ్యం: వైయస్
అనంతపురం: వచ్చే ఆరు నెలల్లో రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఇందిరమ్మ గృహాలను ప్రారంభించిన అనంతరం ఆయన బుధవారం బహిరంగసభలో మాట్లాడారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అమలు సాధ్యమేనని, వచ్చే ఏడాది జనవరి, ఏప్రిల్ నెలల మధ్యకాలంలో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఆర్థికపరమైన కారణాలు గానీ, ఇతర కారణాలు గానీ ఈ పథకం అమలుకు అడ్డు రావని ఆయన అన్నారు.
తమ పథకాన్ని కాపీ కొడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనపై రాజశేఖర రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడు నకిలీ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి. రామారావును వెన్నుపోటు పొడిచారని, ఎన్.టి. రామారావు పథకాలకు కూడా వెన్నుపోటు పొడిచారని ఆయన వ్యాఖ్యానించారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని, మద్యనిషేదాన్ని చంద్రబాబు తూట్లు పొడిచారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications