నన్నపనేని ఇంటిని ముట్టడించిన మహిళా కాంగ్రెస్
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై వ్యాఖ్యలకు నిరసనగా గంగా భవాని నేతృత్వంలోని మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి ఇంటిని ముట్టడించారు. గేట్లు దూకి మసాబ్ ట్యాంకులోని మై హోం అపార్టుమెంటులోకి వారు దూసుకెళ్లారు. నన్నపనేని రాజకుమారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతకుముందు వారు శాసనసభ ఎదుట నన్నపనేని రాజకుమారి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నన్నపనేని రాజకుమారికి వారు హెచ్చరికలు చేశారు.
ఈ ముట్టడిపై నన్నపనేని రాజకుమారి తీవ్రంగా స్పందించారు. రాజశేఖర్ రెడ్డి తనను చంపించడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. తనకేమైనా జరిగితే రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడు జగన్ బాధ్యత వహించాలని ఆమె అన్నారు. తన గన్ మెన్ ను కూడా తొలగించారని ఆమె చెప్పారు. తనకు క్షమాపణ చెప్పాలని ఆమె రాజశేఖర రెడ్డిని డిమాండ్ చేశారు. రాజశేఖర రెడ్డి ఇంటి ముందు తాను న్యాయపోరాటం చేస్తానని ఆమె అన్నారు. తన ఆరోపణలకు సమాధానం చెప్పలేక ఆడవాళ్లను తనపైకి పంపించారని ఆమె వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications