ఆ రోజుల్లో పచ్చాచొక్కాలకే అన్నీ: వైయస్
కర్నూలు: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పచ్చచొక్కాలకే జన్మభూమి కార్యక్రమ ఫలితాల్లో ప్రాధాన్యం ఇచ్చేవారని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి విమర్శించారు. కర్నూలు జిల్లా డోన్ లో ఆయన బుధవారంనాడు ఇందిరమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాము పార్టీలతో ప్రమేయం లేకుండా పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఏ పార్టీకి చెందినవారైనా పేదలందరికీ ఇళ్లు ఉండాలన్నదే తమ అభిమతమని ఆయన అన్నారు.
పార్టీలతో ప్రమేయం లేకుండా పేదలందరికీ ఇళ్లు ఇవ్వకపోతే అప్రజాస్వామికమని ఆయన అన్నారు. పింఛన్లను అర్హులందరకీ ఇస్తున్నామని, ఆ సొమ్మును ప్రతి నెలా ఒకటో తేదీన్నే చెల్లిస్తామని ఆయన చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేశామని ఆయన చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దిక్కుమాలిన పరిస్థితులుండేవని ఆయన అన్నారు. డ్వాక్రా మహిళలకు ఇతోధికంగా పావలా వడ్డీకే రుణాలు ఇస్తున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications