నన్నపనేని ఇంటిపై దాడి కేసులో భవాని అరెస్టు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి ఇంటిపై దాడి కేసులో పోలీసులు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ గంగాభవానిని మంగళవారం అరెస్టు చేశారు. ఆమెను హైదరాబాదులోని హుమాయున్ నగర్ పోలీసు స్టేషనుకు తరలించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గంగా భవాని నేతృత్వంలో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఇటీవల నన్నపనేని రాజకుమారి ఇంటిపై దాడి చేశారు. ఈ కేసులో గంగాభవాని పోలీసు స్టేషనులో లొంగిపోయారు. ఆమెను పోలీసులు అరెస్టు చేసి, అనంతరం విడుదల చేశారు.
అంతకు ముందు గంగా భవాని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనకు అన్ని జిల్లాల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాళ్లు సంఘీభావం ప్రకటించారని ఆమె చెప్పారు. నన్నపనేని రాజకుమారి హద్దూ అదుపూ లేకుండా మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని తనకు ముఖ్యమంత్రిగానీ, ఇతర నాయకులు గానీ సూచించలేదని, పార్టీ నాయకత్వం ఆదేశిస్తే అందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications