పిసిసి ఎంపిక సజావుగానే జరుగుతుంది: మొయిలీ
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడి ఎంపిక సజావుగానే జరుగుతుందని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి వీరప్పమొయిలీ చెప్పారు. పిసిసి అధ్యక్షుడి ఎంపిక కసరత్తు రెండు రోజుల్లో పూర్తవుతుందని ఆయన అన్నారు. హైదరాబాదులోని ఎగ్జిబిషన్ గ్రౌండులో జరిగిన ఒక పెళ్లికి హాజరైన ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పిసిసి అధ్యక్షుడి ఎంపికలో ఏ విధమైన వివాదం ఉండదని ఆయన చెప్పారు. ఆయన గురువారం ఉదయం బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఆయనకు స్వాగతం చెప్పడానికి పెద్ద యెత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా కొద్దిపాటి తొక్కిసలాట కూడా జరిగింది.
పిసిసి అధ్యక్షుడి ఎంపిక కోసం ఆయన గురువారం మధ్యాహ్నం నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులతో మాట్లాడ్తారు. రేపు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. పిసిసి పదవి బిసి నేతకే ఇవ్వాలని అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనపై పార్టీ అధిష్ఠానవర్గం సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని తాను వీరప్పమొయిలీతో చెప్పినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications