మనీషా కిడ్నాప్: నక్సల్స్ పేరుతో ఫోన్
హైదరాబాద్: వరంగల్ జిల్లా కాశీబుగ్గలో సోమవారం సాయంత్రం కిడ్నాప్ నకు గురైన మనీషా అనే 12 ఏళ్ల బాలిక కేసును ఛేదించడానికి పోలీసులు విఫలయత్నం చేస్తున్నారు. మనీషా అనే అమ్మాయిని ఎవకు కిడ్నాప్ చేశారనే విషయం తెలియడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. మనీషా కిడ్నాప్ జరిగినప్పటి నుంచి తల్లిదండ్రులకు మూడు సార్లు ఫోనులు వచ్చాయి. తాము ప్రజాప్రతిఘటన నక్సలైట్లమని, తమకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని అంటూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఈ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు దృష్టి సారించడం లేదు. ఇది ఒక పబ్లిక్ టెలిఫోను నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.
తాము 25 లక్షల రూపాయలు ఇచ్చుకునే స్థితిలో లేమని, దయచేసి తమ అమ్మాయిని వదిలిపెట్టాలని మనీషా తల్లిదండ్రులు అంటున్నారు. అయితే మనీషాను నక్సలైట్లు కిడ్నాప్ చేయలేదని అనుకుంటున్నారు. ఈ కిడ్నాప్ నకు సంబంధించి పోలీసులు కొందరిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సోమవారం సాయంత్రమే వరంగల్ జిల్లా నర్సంపేటలో మరో ఐదుగురు విద్యార్థులను కిడ్నాప్ చేయడానికి దుండగులు చేసిన ప్రయత్నం విఫలమైంది. పాఠశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులను తాము ఆటోలో దింపుతామని దుండగులు చెప్పి ఆటోలో ఎక్కించుకున్నారు. ఆ ఆటో నర్సంపేట వైపు కాకుండా వరంగల్ వైపు దారి తీయడంతో పిల్లలు గట్టిగా అరిచారు. దీంతో గిర్నిబావి గ్రామస్థులు ఆటోను వెంబడించడంతో దుండగులు పిల్లలను వదిలేసి పారిపోయారు.












Click it and Unblock the Notifications