తెలంగాణంపై తమ్ముళ్లతో బాబు భేటీ
హైదరాబాద్: తెలంగాణపై పార్టీలో చెలరేగిన వివాదానికి తెర వేసేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సోమవారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. తెలంగాణపై పార్టీ మహానాడు లోగా నిర్ణయం తీసుకుంటుందని దేవేందర్ గౌడ్ చేసిన ప్రకటనతో తెలుగుదేశం పార్టీలో చిచ్చు మొదలైంది. తెలుగుదేశం పార్టీ నాయకులు రెండుగా చీలిపోయి తెలంగాణకు అనుకూలంగా, వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు ముఖ్యనేతలతో మాట్లాడారు.
తెలంగాణ అంశం కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీలకు సంబంధించింది మాత్రమేనని చంద్రబాబు వారితో అన్నారు. తమకు దానితో ఏ విధమైన సంబంధం లేదని ఆయన చెప్పారు. ప్రభుత్వ అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కాంగ్రెసు రెండో ఎస్సార్సీని ముందుకు తెచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణపై బహిరంగ ప్రకటనలు చేయవద్దని, తమ పార్టీ నిర్ణయం స్పష్టంగా ఉందని ఆయన చెప్పారు. దేవేందర్ గౌడ్ చంద్రబాబుతో సోమవారం ఉదయం సమావేశమయ్యారు. పార్టీ కార్యకర్తల్లో స్థైర్యాన్ని నింపేందుకే తాను ఆ ప్రకటన చెసినట్లు దేవేందర్ గౌడ్ చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications