పిల్లల హత్య: తల్లిపై అనుమానాలు
కరీంనగర్: కరీంనగర్ లోని విద్యానగర్ లో ఇద్దరు బాలికలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ బాలికలను తానే చంపానంటూ బాలికల అమ్మమ్మ పోలీసులకు లొంగిపోయింది. పోలీసులు బాలికల తల్లి రజితను ప్రశ్నిస్తున్నారు. తల్లిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రజిత అనే మహిళ సంక్రాంతి పండుగకు ఇద్దరు కూతుళ్లు శ్వేత, స్వాతిలతో తల్లిగారింటికి వచ్చింది. అయితే ఆ ఇద్దరు బాలికలు గురువారం ఉదయం మరణించినట్లు తేలింది.
పిల్లల తల్లి ఇంట్లో లేదని, బయటకు వెళ్లిపోయిందని, పిల్లలు నిద్ర లేవడం లేదని పిల్లల అమ్మమ్మ బయటకు వచ్చి ఇరుగుపొరుగువారితో చెప్పింది. దీంతో అందరూ వెళ్లి చూడగా పిల్లలు మరణించి ఉన్నారు. వారి గొంతు నులిమినట్లు కనిపిస్తోంది. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతవరకు ఏమీ మాట్లాడని అమ్మమ్మ పోలీసులు రాగానే పిల్లలను తానే చంపానని చెప్పి లొంగిపోయింది. అదే సమయంలో తల్లి బయటి నుంచి వచ్చింది. ఆమెను పోలీసులు ప్రశ్నించగా సరైన సమాధానాలు రావడం లేదు. అమ్మమ్మ మానసిక స్థితి సరిగా లేదని, తల్లి సమాధానాలు పొంతన లేకుండా ఉండడంతో తల్లే పిల్లలను చంపి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్వేత ఒకటో తరగతి చదువుతుండగా, స్వాతి బడికి కూడా వెళ్లడం లేదు.












Click it and Unblock the Notifications