అభివృద్ధి అంతా మాదే: బాబు
హైదరాబాద్: రాష్ట్రంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే తమ ప్రభుత్వ హయాంలోనేనని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన శుక్రవారంనాడు శాసనసభలో మాట్లాడారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన విమర్శించారు. గవర్నర్ ప్రసంగానికి దిశానిర్దేశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రైతులు సుఖసంతోషాలతో ఉన్నారని గవర్నర్ ప్రసంగంలో చెప్పడం ప్రభుత్వ ఆత్మవంచన అని ఆయన వ్యాఖ్యానించారు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని, మునుపెన్నడూ లేనంత ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన అన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి చెందిందని ఆయన చెప్పుకున్నారు. ప్రభుత్వ భూములను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు. సంపన్నులకే ప్రభుత్వం సేవలు చేస్తోందని, పేదలు మరింత పేదలవుతున్నారని ఆయన అన్నారు. చేతివృత్తులవారిని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి దుర్భరంగా ఉందని ఆయన అన్నారు. జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు కాంగ్రెసుకు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
