విశాఖపట్నంలో జనసేనకు బిగ్ షాక్..!!
విశాఖపట్నంలో జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ గుడ్ బై చెప్పారు. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు రాజీనామా లేఖను పంపారు. సుదీర్ఘకాలంగా ప్రజాజీవితంలో ఉన్నానని, స్థానిక సమస్యలపై రాజీలేని పోరాటం చేశానని, అయినా తనకు తగిన గుర్తింపు లభించట్లేదని పేర్కొన్నారు.
సిట్టింగ్ కార్పొరేటర్ గా ఉన్నప్పటికీ తనకు టికెట్ ఇవ్వకుండా పార్టీ అగ్రనాయకత్వం అన్యాయం చేసిందని మూర్తి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో పార్టీ నేతలే తన ఓటమికి కుట్రలు చేశారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్రలో చోటుచేసుకున్న భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా తాను అనేక పోరాటాలు చేశానని గుర్తు చేశారు. రుషికొండపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్యాలెస్ వ్యవహారం దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.

విశాఖ సీబీసీఎన్సీ స్థలంలో వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన నిర్మాణాలను అడ్డుకున్నానని, దీనిద్వారా రూ.100 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వానికి అప్పగించేలా కృషి చేశానని మూర్తియాదవ్ తెలిపారు. ఎండాడ, భీమిలి బీచ్ రోడ్డులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాణిజ్య సముదాయంపై హైకోర్టులో న్యాయపోరాటం చేసి గెలిచానని వివరించారు. దీనికోసం 80 లక్షల రూపాయల సొంత నిధులను ఖర్చు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కోసం కొన్ని రోజుల పాటు జైలు జీవితం సైతం గడిపానని మూర్తి యాదవ్ తెలిపారు. అయినా కూడా బయటి నుంచి వచ్చిన వారికి పార్టీలో పదవులు దక్కాయని, తనకు సిట్టింగ్ కార్పొరేటర్ టికెట్ కూడా ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేటర్ గా తన వార్డులో సుమారు రూ. 50 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టానని, తన గౌరవ వేతనాన్ని అన్న క్యాంటీన్లు, గ్రంథాలయాలకు విరాళంగా అందించానని పేర్కొన్నారు. ఈ ఒక్కవార్డులో 6,000 మంది జనసేన సభ్యత్వాలు చేయించినట్లు గుర్తు చేశారు.
టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశానని, ఆ సమయంలో జనసేన నేతలు తన ప్రచారానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని మూర్తి యాదవ్ ఆరోపించారు. మేయర్ అభ్యర్థికి కూడా ఉద్దేశపూర్వకంగా కప్పు- సాసర్ గుర్తు కేటాయించడం వల్ల ఓటర్లు కొంత గందరగోళానికి గురయ్యారని, ఫలితంగా తాను 62 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యానని పేర్కొన్నారు. పోలింగ్ రోజున దాడులు, బెదిరింపులకు కూడా పాల్పడ్డారని ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే జనసేన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications
